

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో 14వ రోజు ఆదివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సండే ఎపిసోడ్ కావడంతో ఎలిమినేషన్‌తో పాటు హౌస్‌మేట్స్ మధ్య పలు భావోద్వేగాలు, వినోదాత్మక సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. శనివారం ప్రారంభమైన మ్యానిప్యులేటర్–పప్పెట్ అంశం ఆదివారం కూడా కొనసాగింది. త్రిగున్, వర్షిణి, సుధీర్, నరేష్, వంశీ, అమన్, ముఖేష్ తదితరులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ నాగార్జున సేవ్ చేస్తూ వచ్చారు. చివరకు సుధీర్, కృష్ణుడు, సృష్టి మిగలగా సుధీర్ సేవ్ అయ్యారు.
ఆ తర్వాత కృష్ణుడు, సృష్టిలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాను ఎలిమినేట్ కావచ్చని ముందుగానే మానసికంగా సిద్ధమయ్యానని కృష్ణుడు త్రిగున్‌తో చెప్పినట్లుగా ఎపిసోడ్‌లో చూపించారు. చివరకు కృష్ణుడు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించగా, సృష్టి సేఫ్ అయ్యారు. కృష్ణుడికి హౌస్‌మేట్స్ భావోద్వేగ వీడ్కోలు పలికారు. రోహిత్ తన తండ్రిని గుర్తు చేసుకుంటూ కృష్ణుడి కళ్లను చూసి ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్‌పైకి వచ్చిన కృష్ణుడు, దేబ్జానీ, సృష్టి, అమన్, ఝాన్సీలను పాజిటివ్‌గా, సుధీర్, ముఖేష్, చరణ్, వర్షిణిని నెగిటివ్‌గా భావిస్తున్నట్లు తెలిపారు.
ఎపిసోడ్‌లో సండే ఫన్ డేలో భాగంగా హౌస్‌మేట్స్ పలు వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఝాన్సీ పాట పాడగా, త్రిగున్, అమన్ బిగ్ బాస్‌ను ఉద్దేశిస్తూ ర్యాప్ సాంగ్‌తో అలరించారు. ముఖేష్, దేబ్జానీ రొమాంటిక్ పాటకు డ్యాన్స్ చేయగా, వారి కెమిస్ట్రీ హౌస్‌మేట్స్‌ను ఆకట్టుకుంది. చరణ్, వర్షిణి కూడా మాస్ పాటకు డ్యాన్స్ చేశారు. మరోవైపు మ్యానిప్యులేటర్–పప్పెట్ గేమ్‌లో పలువురు కంటెస్టెంట్లు ఇతరుల ఆటతీరుపై తమ అభిప్రాయాలను చెప్పారు. కెప్టెన్సీ టాస్క్‌లో రోహిత్, వంశీ మధ్య జరిగిన గొడవపై నాగార్జున స్పందిస్తూ రోహిత్‌దే తప్పని చెప్పినట్లు ఎపిసోడ్‌లో వెల్లడైంది.
అనంతరం హౌస్‌లో బెస్ట్ ప్లేయర్ ఎవరు అనే ప్రశ్నకు కంటెస్టెంట్లు తమ ఎంపికలు తెలిపారు. పలువురు ముఖేష్, రామ్ ప్రసాద్, రోహిత్, షాలినీ, త్రిగున్ తదితరుల పేర్లు చెప్పారు. ఎక్కువమంది ముఖేష్‌ను బెస్ట్ ప్లేయర్‌గా ఎంపిక చేయడంతో ఆయనకు బెస్ట్ ప్లేయర్ స్టార్ బ్యాడ్జ్ అందించారు. సీజన్ 10లో తొలి వారం మహాపరీక్ష, రెండో వారం పవర్ ఆఫ్ పీపుల్ తర్వాత మూడో వారం టెంప్టేషన్ వర్సెస్ టెన్షన్ ఉండనున్నట్లు ప్రకటించారు. సోమవారం ఎపిసోడ్‌లో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!