

భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటర్ మార్కెట్లలో హైదరాబాద్ ఒకటిగా నిలిచింది. ఐటీ కేంద్రంగా పేరుగాంచిన నగరం ఇప్పుడు డిజిటల్ మౌలిక సదుపాయాల ప్రధాన కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన ‘ఇండియా డేటా సెంటర్ మార్కెట్ అప్‌డేట్-2025’ నివేదిక ప్రకారం, హైదరాబాద్ డేటా సెంటర్ సామర్థ్యం 2022లో 60.9 మెగావాట్ల నుంచి 2025 నాటికి 151.4 మెగావాట్లకు పెరిగింది. అదనంగా 1.9 గిగావాట్ల సామర్థ్యంతో పలు ప్రాజెక్టులు వివిధ దశల్లో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ విషయంలో ముంబయి తర్వాత హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది.
ఇతర మహానగరాలతో పోలిస్తే తక్కువ వ్యయాలు, ప్రకృతి విపత్తుల ప్రభావం తక్కువగా ఉండటం, అధునాతన జీపీయూలు మరియు లిక్విడ్ కూలింగ్ వంటి సాంకేతికతలకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు హైదరాబాద్‌కు ప్రధాన బలాలుగా మారాయి. ఎన్‌టిటి డేటా, అదానీకనెక్స్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరిస్తుండగా, మైక్రోసాఫ్ట్ తన ఇండియా సౌత్ సెంట్రల్ డేటా సెంటర్‌ను ఈ ఏడాది ప్రారంభించనుంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఇప్పటికే మూడు అవైలబిలిటీ జోన్లను నిర్వహిస్తుండగా, ఒరాకిల్ కూడా హైదరాబాద్‌లో కొత్త డేటా సెంటర్‌ను ప్రకటించింది. ఏఐ, క్లౌడ్ సేవలు, డేటా లోకలైజేషన్ నిబంధనల కారణంగా దేశవ్యాప్తంగా డేటా సెంటర్ల రంగం వేగంగా విస్తరిస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!