

వాహనాల అసలు గుర్తింపును దాచడం, ట్రాఫిక్ నిబంధనల నుంచి తప్పించుకోవడం, చట్టాలను ఉల్లంఘించడం కోసం కొందరు వాహనదారులు ఇష్టానుసారంగా నంబర్ ప్లేట్లను వినియోగిస్తున్నారు. ఈ తరహా ఉల్లంఘనలకు సంబంధించి ఇటీవల బూర్గంపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వాహనంపై కేసు నమోదైంది. ప్రభుత్వం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ల (హెచ్ఎస్ఆర్పీ) వినియోగాన్ని తప్పనిసరి చేసినప్పటికీ కొందరు వాహనదారులు వాటిని పట్టించుకోవడం లేదు. నంబర్ ప్లేట్లపై రాజకీయ నాయకుల ఫొటోలు, పార్టీల జెండాలు, గుర్తులు, సామాజిక వర్గాల పేర్లు, ఇతర వివరాలను ముద్రించి వాహనాలకు అమర్చుతున్నారు. మరికొందరు వింత ఆకృతులు, రంగులు, ఫ్యాన్సీ అక్షరాలతో నంబర్ ప్లేట్లను తయారు చేయించుకుంటున్నారు.
నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనాలపై పోలీసులు, రవాణా శాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాహనాలను సీజ్ కూడా చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనలపై కేసులు నమోదవుతున్నప్పటికీ, కొంతమంది రాజకీయ నేతల సిఫార్సులతో కొన్ని వాహనాలను వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర మోటారు వాహనాల చట్టంలోని 50, 51 నిబంధనల ప్రకారం నాన్ ట్రాన్స్పోర్టు వాహనాలకు తెలుపు రంగు ప్లేటుపై నల్లని అక్షరాలు, రవాణా వాహనాలకు పసుపు రంగు ప్లేటుపై నల్లని అక్షరాలు ఉండాలి. విద్యుత్ వాహనాలకు ఆకుపచ్చ రంగు ప్లేటుపై తెలుపు అక్షరాలు ఉండాలి. నంబర్ ప్లేట్లపై ఫ్యాన్సీ అక్షరాలు, పేర్లు, ఫొటోలు, హోదాలు, కులాల పేర్లు, రాజకీయ పదవులు రాయడం నిబంధనలకు విరుద్ధం.
ప్రతి వాహనానికి హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేటు తప్పనిసరి. దీనిపై ప్రత్యేకమైన లేజర్ కోడ్, పది అంకెల క్రోమియం హోలోగ్రామ్ స్టిక్కర్ ఉంటాయి. వీటి ద్వారా వాహనాలను సులభంగా గుర్తించడంతో పాటు చోరీలకు గురైన వాహనాల ఆచూకీ తెలుసుకోవచ్చు. హెచ్ఎస్ఆర్పీ లేకపోయినా, నంబర్లు మసకబారినా, వెలిసిపోయినా లేదా నిబంధనలకు విరుద్ధంగా రాసినా మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 177 ప్రకారం మొదటిసారి రూ.500, తదుపరి ఉల్లంఘనలకు రూ.1,500 జరిమానా విధించవచ్చు. పదేపదే నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. నకిలీ నంబర్ ప్లేటు వినియోగిస్తే సెక్షన్ 192 కింద మొదటిసారి రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు, రెండోసారి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు జరిమానాతో పాటు ఏడాది వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!