

ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలకు వరప్రదాయినిగా పేరుగాంచిన మంజీరా నది ప్రస్తుతం తీవ్ర కాలుష్య సమస్యను ఎదుర్కొంటోంది. పటాన్‌చెరు, సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వెలువడుతున్న వ్యర్థాలు, రసాయనాలు నక్కవాగు ద్వారా నదిలో కలుస్తున్నాయి. దీంతో సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని సరాఫ్‌పల్లి, లింగంపల్లి ప్రాంతాల్లో మంజీరా నది నీరు పూర్తిగా కలుషితమవుతోంది. నది ఉపరితలంపై భారీగా నురగ పేరుకుపోవడం స్థానికుల్లో ఆందోళన కలిగిస్తోంది. లక్షలాది మందికి నీటిని అందించే నది ఈ విధంగా కాలుష్యానికి గురికావడంపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాలుష్యం కారణంగా దాదాపు మూడు కిలోమీటర్ల మేర నది నుంచి తీవ్ర దుర్వాసన వెలువడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. నదీ జలాలపై ఆధారపడే ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. పరిశ్రమల వ్యర్థాలు నదిలో కలవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని, కాలుష్యానికి కారణమైన పరిశ్రమలను గుర్తించి కఠినంగా వ్యవహరించాలని అధికారులను కోరుతున్నారు. మంజీరా నదిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టి, నీటిని తిరిగి స్వచ్ఛంగా మార్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!