

వ్యవసాయంలో రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తూ, పంట దిగుబడులకు నష్టం కలగకుండా పర్యావరణానికి మేలు చేసే సరికొత్త హరిత ఎరువును భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐఏఆర్‌ఐ), న్యూఢిల్లీ, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ), హైదరాబాద్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. మొక్కజొన్న పిండి, మామిడి జీడి ఆధారిత బయోపాలిమర్లతో పాటు నానోక్లేను ఉపయోగించి ఈ మిశ్రమాన్ని రూపొందించారు. ఇందులో యూరియాతో పాటు ల్యాక్టోకోకస్ లాక్టిస్, సూడోమోనాస్ ఎరుగినోసా వంటి సూక్ష్మజీవులను చేర్చారు. పరిశోధనల ప్రకారం, సాధారణ యూరియా వినియోగంతో పోలిస్తే 25 శాతం తక్కువ నత్రజనిని ఉపయోగించినప్పటికీ పంటలకు అవసరమైన పోషకాలు అందడంతో పాటు దిగుబడులు తగ్గకుండా ఉండే అవకాశం ఉంది. ఈ సూక్ష్మజీవులు నేలలో సుమారు 180 రోజుల వరకు జీవించి ఉండగలవని, భాస్వరం, జింక్ వంటి పోషకాలను మొక్కలు గ్రహించేందుకు తోడ్పడతాయని పరిశోధకులు వెల్లడించారు.
మొక్కజొన్న, గోధుమ పంటల మార్పిడి విధానంలో ఈ ఎరువుల సామర్థ్యాన్ని పరిశీలించారు. సాధారణ యూరియాతో పోలిస్తే మొక్కజొన్న పిండి ఆధారిత మిశ్రమంతో గోధుమలో నైట్రస్ ఆక్సైడ్ ఉద్గారాలు 28.7 శాతం, మొక్కజొన్నలో 24.2 శాతం తగ్గాయి. మామిడి జీడి ఆధారిత మిశ్రమంతో గోధుమలో 17.2 శాతం, మొక్కజొన్నలో 21.4 శాతం ఉద్గారాలు తగ్గినట్లు గుర్తించారు. ఈ బయోపాలిమర్ మిశ్రమాలు నేలలో తేమను నిలిపి ఉంచడంలోనూ మంచి సామర్థ్యాన్ని చూపించాయి. 24 గంటల తర్వాత ఒక గ్రాము మొక్కజొన్న పిండి మిశ్రమం 68 గ్రాముల నీటిని, మామిడి జీడి మిశ్రమం 62 గ్రాముల నీటిని గ్రహించినట్లు పరిశోధనలో వెల్లడైంది. ఇది వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు ఉపయోగపడవచ్చు. అయితే కార్బన్ డయాక్సైడ్, మీథేన్ ఉద్గారాలపై వీటి ప్రభావాన్ని మరింత అధ్యయనం చేయాల్సి ఉందని, వివిధ నేలలు, వాతావరణ పరిస్థితుల్లో విస్తృత స్థాయి క్షేత్ర ప్రయోగాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!