

కొంతకాలంగా పేలవ ప్రదర్శనతో విమర్శలు ఎదుర్కొంటున్న భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. న్యూజిలాండ్-ఎతో జరిగిన రెండో అనధికారిక టెస్టులో అజేయ సెంచరీతో ఆకట్టుకున్నాడు. 162 బంతుల్లో 155 పరుగులు చేసిన అతడు.. తన ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. నాలుగో రోజు ఆటను 32 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ప్రారంభించిన భారత్-ఎ.. సాయి సుదర్శన్ (11), దేవదత్ పడిక్కల్ వికెట్లను త్వరగా కోల్పోయి 36/2తో కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన జైస్వాల్.. యశ్ రాథోడ్‌తో కలిసి అద్భుతంగా ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 247 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాథోడ్ కూడా 100 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్-ఎ రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లకు 282 పరుగులు చేసింది.
టీ విరామం తర్వాత వెలుతురు లేమి, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఆటను ముందుగానే నిలిపివేశారు. దీంతో భారత్-ఎ, న్యూజిలాండ్-ఎ మధ్య రెండో అనధికారిక టెస్టు డ్రాగా ముగిసింది. అంతకుముందు న్యూజిలాండ్-ఎ తొలి ఇన్నింగ్స్‌లో 424 పరుగులు చేయగా.. భారత్-ఎ 346 పరుగులకు ఆలౌటైంది. ప్రస్తుతం భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్ ముగియగా, బుధవారం నుంచి ఐదు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. అనంతరం ఇరు జట్లు రెండు టెస్టుల్లో తలపడనున్నాయి. పరిమిత ఓవర్ల జట్టులో చోటు దక్కించుకోని జైస్వాల్.. టెస్టు సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతడి అజేయ సెంచరీ భారత జట్టుకు శుభసూచకంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!