

బంగ్లాదేశ్‌లోని జైళ్లలో ఉన్న విదేశీ ఖైదీల్లో సగానికి పైగా భారతీయులే ఉన్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, మానవ అక్రమ రవాణా, బంగారం స్మగ్లింగ్ తదితర నేరాలకు సంబంధించి 15 దేశాలకు చెందిన కనీసం 407 మంది విదేశీయులు అక్కడి జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నట్లు సమాచారం. వీరిలో 238 మంది భారతీయులు ఉన్నారు. వారిలో 168 మంది ఇప్పటికే తమ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ, స్వదేశానికి పంపేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తికాకపోవడంతో ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. మిగిలిన విదేశీ ఖైదీల్లో మయన్మార్, నైజీరియా, పాకిస్థాన్, మలేషియా తదితర దేశాలకు చెందినవారు ఉన్నారు.
శిక్షాకాలం పూర్తి చేసుకున్న భారతీయ ఖైదీల జాబితాలను బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తమకు పంపినట్లు భారత హైకమిషన్ అధికారి తెలిపారు. అయితే, ఆ ఖైదీలు నిజంగా భారతీయులేనని నిర్ధారించడంలో ఎదురవుతున్న సమస్యల కారణంగా వారి విడుదల ఆలస్యమవుతోందని వివరించారు. ఖైదీలను కలిసి మాట్లాడేందుకు బంగ్లాదేశ్ అధికారుల అనుమతి కోరినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి స్పందన కోసం ఎదురుచూస్తున్నామని, ఖైదీల జాతీయతను ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతోందని వెల్లడించారు. గుర్తింపు నిర్ధారణ పూర్తయిన తర్వాతే వారి స్వదేశానికి తరలింపునకు సంబంధించిన తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!