

పల్నాడు జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు సాగు, తాగునీరు అందించేందుకు చేపట్టిన వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. డీపీఆర్‌ను అక్టోబరు నెలాఖరులోగా పూర్తి చేయాలని, ప్రి-ఫీజిబిలిటీ నివేదికకు ఆమోదం పొందిన అనంతరం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని సూచించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం రాత్రి ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
ప్రాజెక్టుకు అవసరమైన 586 ఎకరాల భూమి సేకరణకు ప్రభుత్వం రూ.63 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. భూసేకరణ ప్రక్రియను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలోని 36 ప్రాజెక్టుల్లో వరికపూడిశెలకు చోటు కల్పించామని, దీన్ని త్వరగా పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సమావేశంలో నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నీటిపారుదల సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!