

తెలంగాణ పర్యాటక రంగాన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రోత్సహించేందుకు ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ వంటి వేదికలు కీలక పాత్ర పోషిస్తాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో నిర్వహించిన 24వ ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్-2026కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రదర్శనలో 16 రాష్ట్రాలు, ఏడు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. పర్యాటక సంస్థలు, ట్రావెల్ కంపెనీలు, ఆతిథ్య రంగ సంస్థలు, పరిశ్రమ ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం ద్వారా కొత్త వ్యాపార అవకాశాలు, భాగస్వామ్యాలు, ఉపాధి మార్గాలు ఏర్పడతాయని మంత్రి పేర్కొన్నారు.
ఈ ఫెయిర్ ద్వారా దేశీయ, అంతర్జాతీయ పర్యాటక రంగ కొనుగోలుదారులు, సేవలందించే సంస్థల మధ్య అనుసంధానం పెరిగి, మార్కెట్ విస్తరణకు అవకాశాలు ఏర్పడతాయని జూపల్లి తెలిపారు. తెలంగాణకు మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలా కొత్త ప్యాకేజీలను రూపొందించాలని ట్రావెల్ కంపెనీలను కోరారు. ఈ ఏడాది డిసెంబరులో హైదరాబాద్ వేదికగా జరగనున్న గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను ప్రస్తావిస్తూ, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నాసిర్ అస్లాం వానీ, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరి, పర్యాటక శాఖ డైరెక్టర్ లక్ష్మణ్ రంజిత్ నాయక్, భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఫెయిర్‌ఫెస్ట్ ఎండీ ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!