

విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడులు వచ్చే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సదస్సు తొలిరోజు కియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, గెయిల్, గ్రీన్‌కో, జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ సహా పలు ప్రముఖ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. తొలిరోజు మొత్తం 88 పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి ఒప్పందాలు, ప్రభుత్వ ఉత్తర్వుల మార్పిడి జరిగింది. వీటిలో 73 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూలు), 15 ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. పునరుత్పాదక ఇంధనం, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వాహనాలు, రసాయనాలు, పెట్రోకెమికల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.
జిల్లాల వారీగా పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలు నమోదయ్యాయి. శ్రీ సత్యసాయి జిల్లాలో కియా, తిరుపతి జిల్లాలో హీరో మోటోకార్ప్, శ్రీకాకుళంలో రష్మి మెటలర్జికల్ ఇండస్ట్రీస్, కడపలో జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ పెట్టుబడులు పెట్టనున్నాయి. పునరుత్పాదక ఇంధన రంగంలో గ్రీన్‌కో, క్లీన్‌మాక్స్, కృష్ణా జిల్లాలో మేఘా ఇంజినీరింగ్ ఒప్పందాలు చేసుకున్నాయి. రసాయనాలు, పెట్రోకెమికల్స్ రంగంలో గెయిల్ ఇండియా, ఎన్‌ఏఎన్ మ్యాగ్నెటెక్, ఎన్‌ఏఎన్ సిలోక్స్ గ్రీన్‌మెట్ ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేశాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎస్‌ఎల్‌ఎన్ కాఫీ, హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్, శ్రీ వసుధ ఫుడ్స్ ముందుకొచ్చాయి. ఏరోస్పేస్, రక్షణ రంగాల్లోనూ ఆస్ట్రోబేస్ స్పేస్ టెక్నాలజీస్, వజ్రశక్తి వెంచర్స్, ఆదిత్య ప్రెసిటెక్ పెట్టుబడి ప్రతిపాదనలు సమర్పించాయి. ఈ ఒప్పందాలతో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాలకు కొత్త ఊతం లభించనుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!