

విద్యావంతులు, బాధ్యతగా మెలగాల్సిన వారే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం అత్యంత బాధాకరమని, క్షమించరాని నేరమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ఆందోళన వ్యక్తం చేశారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలో బ్యాంకు ఉద్యోగి ధర్మరాజు రాంగ్ రూట్లో ద్విచక్రవాహనం నడపడంతో ఓయూ ఇంజినీరింగ్ విద్యార్థిని అయిషా ముస్ఫీరా (21) బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై సీపీ సజ్జనర్ మంగళవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ప్రమాదానికి ముందు తండ్రితో నవ్వుతూ, మాట్లాడుకుంటూ ప్రయాణించిన కుమార్తె క్షణాల్లో బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు కోల్పోవడంతో ఆ తండ్రి తీవ్రంగా తల్లడిల్లిపోయారని పేర్కొన్నారు.
కేవలం రెండు నిమిషాల సమయం ఆదా చేసుకోవాలనే తొందరపాటు ఒక కుటుంబంలో తీరని విషాదాన్ని నింపిందని సజ్జనర్ ఆవేదన వ్యక్తం చేశారు. వాహనదారులు అడ్డదారిలో ప్రయాణించడం మరొకరి జీవితానికి ముగింపు కాకూడదని సూచించారు. రాంగ్ రూట్లో ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని, రహదారి భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సీపీ కోరారు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!