

రామాయణంలో సీతను రక్షించేందుకు రావణుడితో వీరోచితంగా పోరాడిన జటాయువు త్యాగానికి గుర్తుగా కేరళంలోని కొల్లాం జిల్లా చడయమంగళంలో జటాయు ఎర్త్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి శిల్పం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకెళ్తున్న సమయంలో జటాయువు అతడిని అడ్డుకొని పోరాడినట్లు రామాయణంలో పేర్కొన్నారు. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా రావణుడిని ఎదుర్కొన్న జటాయువు చివరకు అతడి చేతిలో తీవ్రంగా గాయపడి రెక్కలు కోల్పోతాడు. అనంతరం అక్కడికి చేరుకున్న శ్రీరాముడికి సీతను రావణుడు అపహరించిన విషయాన్ని తెలియజేసి ప్రాణాలు విడుస్తాడు. ప్రముఖ శిల్పి, చిత్రనిర్మాత, కళా దర్శకుడు రాజీవ్ అంచల్ రూపొందించిన ఈ భారీ శిల్పం సుమారు 200 అడుగుల పొడవు, 150 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తుతో నిర్మితమైంది. జటాయువు ధైర్యసాహసాలు, త్యాగం, ధర్మనిష్ఠకు ఇది ప్రతీకగా నిలుస్తోంది.
సుమారు 65 ఎకరాల విస్తీర్ణంలో నాలుగు కొండలపై విస్తరించిన జటాయు ఎర్త్ సెంటర్‌లో పురాణగాథతో పాటు ప్రకృతి అందాలు, సాహస పర్యాటక అనుభవాలను ఆస్వాదించవచ్చు. ఇక్కడ భారీ జటాయువు శిల్పంతో పాటు మ్యూజియం, 6D థియేటర్, వివిధ సాహస కార్యకలాపాలు అందుబాటులో ఉన్నాయి. కొండపైకి చేరుకోవడానికి కేబుల్ కార్ సౌకర్యం ఉండటంతో పాటు 826 మెట్ల మార్గం కూడా ఉంది. తిరువనంతపురం నుంచి సుమారు 50 కిలోమీటర్లు, కొల్లాం జంక్షన్ నుంచి దాదాపు 37 కిలోమీటర్ల దూరంలో ఈ పర్యాటక కేంద్రం ఉంది. చడయమంగళం బస్ స్టాండ్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటంతో ఆటో లేదా స్థానిక రవాణా ద్వారా సులభంగా చేరుకోవచ్చు. రామాయణంలోని జటాయువు వీరోచిత పోరాటాన్ని గుర్తుచేసే ఈ ప్రదేశం చరిత్ర, పురాణాలు, ప్రకృతి, సాహసాలను ఒకేచోట ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!