

అమెరికాలో విదేశీ నిపుణులు ఉద్యోగాలు చేసేందుకు కీలకమైన హెచ్-1బీ వీసా కార్యక్రమంలో రానున్న రోజుల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అమెరికా కార్మికశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆంటోనీ డి’ఎస్పొసిటో తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. విదేశీ కార్మికుల వీసా వ్యవస్థలో అక్రమాలపై ప్రభుత్వం విస్తృతంగా దర్యాప్తు చేస్తోందని చెప్పారు. ఇది కేవలం పత్రాల పరిశీలనకు పరిమితమైన వ్యవహారం కాదని, వీసా వ్యవస్థ దుర్వినియోగంపై వాస్తవ ఆధారాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. వచ్చే 365 రోజుల్లో విదేశీ కార్మికుల వీసా కార్యక్రమం ప్రస్తుత రూపానికి భిన్నంగా ఉండొచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
హెచ్-1బీ కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేస్తామని డి’ఎస్పొసిటో ప్రకటించలేదు. అయితే విదేశీ కార్మికుల వీసా వ్యవస్థలో మోసం, కార్మికుల దోపిడీ తదితర ఆరోపణలపై దర్యాప్తు మరింత విస్తరించే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. అమెరికా కార్మికశాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయం ఇప్పటికే పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ, హెచ్-1బీ దరఖాస్తులతో సంబంధం ఉన్న సంస్థలపై చర్యలు చేపడుతోంది. దర్యాప్తు ఫలితాల ఆధారంగా కంపెనీలపై అమలు చర్యలు, విధానపరమైన మార్పులు వచ్చే అవకాశం ఉంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!