

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన జిల్లాలతో సహా ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాలు (జేఎన్‌వీలు) ఏర్పాటు చేయాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిశారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి వినతిపత్రం సమర్పించారు. అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను మంజూరు చేసి, 2027–28 విద్యా సంవత్సరం నుంచి దశలవారీగా ప్రవేశాలు, విద్యాబోధన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ కారణంగా కొన్ని ప్రాంతాల్లో నవోదయ విద్యాలయాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్యా అవకాశాలు దూరమవుతున్నాయని ఎంపీలు వివరించారు.
రాష్ట్రంలో నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని ఎంపీలు ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని జిల్లాల్లో నవోదయ విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. నవోదయ విద్యాలయ సమితి నిబంధనల ప్రకారం ఉచితంగా భూమి, తాత్కాలిక భవనాలు, అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి తెలిపారు. కేంద్ర విద్యాశాఖ, నవోదయ విద్యాలయ సమితి, ఏపీ ప్రభుత్వం, ఎంపీలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఉమ్మడి సమీక్షా సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. అన్ని జిల్లాల్లో జేఎన్‌వీల ఏర్పాటుతో ఎన్ఈపీ–2020, వికసిత్ భారత్–2047 లక్ష్యాల సాధనకు మరింత బలం చేకూరుతుందని పేర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!