

అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ గగనతలంలో కనిపించిన ఓ వింత వస్తువు తీవ్ర చర్చకు దారితీసింది. సెప్టెంబర్ 20న టెహ్రాన్ ఆకాశంలో ప్రకాశవంతమైన, రంగురంగుల లైట్లతో కూడిన పెద్ద అర్ధచంద్రాకార వస్తువు కనిపించినట్లు వీడియోలు వెలుగులోకి వచ్చాయి. మరుసటి రోజు జహాదన్ నగరానికి సమీపంలోనూ కొన్ని లైట్ల సమూహం ఆకాశంలో కదులుతున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో అది గుర్తుతెలియని డ్రోన్ లేదా అత్యాధునిక విమానం కావచ్చన్న ఊహాగానాలు మొదలయ్యాయి. మరికొందరు దీనిని అమెరికాకు చెందినదిగా చెబుతున్న ‘బ్లాక్ మాంతా’ అనే రహస్య విమానంతో అనుసంధానిస్తున్నారు. అయితే అలాంటి విమానం ఉనికిలో ఉందని నిర్ధారించే బహిరంగ ఆధారాలు లేవు. అమెరికా ప్రభుత్వం కూడా ‘బ్లాక్ మాంతా’ పేరుతో ఎలాంటి విమానాన్ని అధికారికంగా గుర్తించలేదు.
ఈ ఊహాజనిత విమానం గురించి గతంలో యాంటీ గ్రావిటీ టెక్నాలజీ, అధునాతన థ్రస్ట్ వ్యవస్థలు, ప్లాస్మా ఆధారిత సాంకేతికత వంటి పలు సిద్ధాంతాలు ప్రచారంలోకి వచ్చాయి. ఇలాంటి సాంకేతికత ఉంటే విమానం వేగం, దిశను వేగంగా మార్చుకోవడంతో పాటు సంప్రదాయ రాడార్‌కు చిక్కకుండా ఉండొచ్చని కొన్ని విశ్లేషణలు చెబుతున్నాయి. అయితే ఈ వాదనలకు స్వతంత్ర ధ్రువీకరణ లేదు. కనిపించిన దృశ్యాలకు ఉపగ్రహానికి సంబంధించిన నీడలు లేదా ఇతర దృశ్య ప్రభావాలు కూడా కారణమై ఉండొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ ప్రభుత్వం లేదా సైన్యం కూడా ఇప్పటివరకు ఆ వస్తువు ఏమిటో అధికారికంగా వెల్లడించలేదు. గతంలో అమెరికా ఎఫ్-117 నైట్‌హాక్ వంటి విమానాలను కొంతకాలం రహస్యంగా ఉంచిన విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు ఈ ఘటనను దానితో పోలుస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!