

కాంగ్రెస్ పార్టీకి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అందిన విరాళాలు గణనీయంగా తగ్గాయి. ఆ ఏడాది పార్టీకి రూ.130.69 కోట్ల విరాళాలు అందగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో వచ్చిన రూ.517.39 కోట్లతో పోలిస్తే సుమారు 75 శాతం తగ్గుదల నమోదైంది. గత దశాబ్ద కాలంలో కాంగ్రెస్ విరాళాల్లో ఇదే అత్యంత భారీ క్షీణతగా పేర్కొంటున్నారు. అంతకుముందు 2015-16లోనూ పార్టీ విరాళాలు భారీగా తగ్గాయి. అప్పట్లో అంతకుముందు ఏడాదితో పోలిస్తే సుమారు 86 శాతం క్షీణత నమోదైంది.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 29సీ ప్రకారం, రాజకీయ పార్టీలు రూ.20 వేలకు మించిన విరాళాల వివరాలను ఏటా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. ఈ మేరకు ఏఐసీసీ కోశాధికారి అజయ్ మాకన్ నివేదికను సమర్పించారు. కాంగ్రెస్ విరాళాలు తగ్గడానికి ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా వచ్చిన నిధులు తగ్గడమే ప్రధాన కారణంగా నివేదికలో పేర్కొన్నారు. ఈ ట్రస్ట్ నుంచి వచ్చిన విరాళాలు రూ.216.34 కోట్ల నుంచి రూ.25 కోట్లకు పడిపోయాయి. మరోవైపు, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బీజేపీ విరాళాల నివేదిక ఇంకా ఎన్నికల సంఘం బహిర్గతం చేయలేదు. 2024-25లో ఆ పార్టీకి రూ.6,074.02 కోట్ల విరాళాలు అందాయి. ఈ నివేదికలో చిన్న విరాళాలు, సభ్యత్వ రుసుములు, కూపన్ల ద్వారా వచ్చిన ఆదాయం, వడ్డీ వంటి ఇతర ఆదాయ వనరులు ఉండవు. 2024-25లో కాంగ్రెస్‌కు కూపన్ల ద్వారా రూ.350.12 కోట్ల ఆదాయం వచ్చింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!