

ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న 22-ఏ భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. ఈ భూములకు సంబంధించి ఒక్క దరఖాస్తు కూడా పెండింగ్‌లో ఉండటానికి వీల్లేదని అధికారులను ఆదేశించారు. 22-ఏ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులపై సచివాలయంలో హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు, జిల్లా రిజిస్ట్రార్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 22-ఏ సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలనే సంకల్పంతో జీవో 118, జీవో 76లకు సంబంధించి ప్రభుత్వం మెమోలు జారీ చేసిందని తెలిపారు.
22-ఏ జాబితాలో ఉన్నప్పటికీ జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ లేదా సంబంధిత మున్సిపల్ అధికారుల అనుమతులు ఉన్న ఇళ్లు, ప్లాట్లు, ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని పొంగులేటి వివరించారు. పట్టణ భూ గరిష్ఠ పరిమితి (యూఎల్‌సీ) దరఖాస్తుల పరిష్కారం, నాన్-అగ్రికల్చరల్ ల్యాండ్ అసెస్‌మెంట్ (నాలా) ప్రక్రియ పూర్తికాని పట్టా భూముల సమస్యలు, జీవో 59 అమలు తదితర అంశాలపై ప్రభుత్వం స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసిందని పేర్కొన్నారు. ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. యూఎల్‌సీకి సంబంధించి వివిధ కోర్టులు వెలువరించిన తుది తీర్పులు, ప్రభుత్వం తరఫున స్పెషల్ లీవ్ పిటిషన్లు దాఖలు చేసే అవకాశాలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలని ఉన్నతస్థాయి కమిటీకి సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!