

పాకిస్థాన్ నటుడు హంజా అలీ అబ్బాసీకి పాత ఫోటో ఒకటి కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. 26/11 ముంబై ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌తో కలిసి దిగిన ఫోటో మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై భారత్‌లోనే కాకుండా పాకిస్థాన్‌లోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హంజా అలీ అబ్బాసీ, ఫవాద్ ఖాన్, మహిరా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన పాకిస్థానీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ జో బచే హై సంగ్ సమేట్ లో విడుదలకు ముందు ఈ వివాదం తెరపైకి వచ్చింది. ఐక్యరాజ్యసమితి ప్రకటించిన అంతర్జాతీయ ఉగ్రవాదితో కలిసి దిగిన ఫోటోపై అబ్బాసీ వివరణ ఇవ్వాలని పాకిస్థానీ న్యాయవాది, రచయిత మునీబ్ ఖాదిర్ డిమాండ్ చేశారు. హఫీజ్ సయీద్‌ను ప్రశంసించినందుకు నటుడు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన కోరారు.
2017లో ఓ పాకిస్థానీ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూ సందర్భంగా హఫీజ్ సయీద్‌తో దిగిన ఫోటోను అబ్బాసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందులో సయీద్‌ను తాను కలిసిన అత్యంత మర్యాదస్తుల్లో ఒకరిగా అభివర్ణించడంతో పాటు, ఆయనను పాకిస్థాన్‌లో అపార్థం చేసుకున్నారని పేర్కొన్నారు. భారత్, అమెరికా ఉగ్రవాదిగా పరిగణించినప్పటికీ తన దృష్టిలో సయీద్ నీతిమంతుడని మరో పోస్టులో ప్రశంసించారు. డిసెంబర్ 4న సిరీస్ విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఈ పోస్టులు మళ్లీ వైరల్ కావడంతో ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) స్పందించింది. ఈ సిరీస్‌ను భారత్‌లో ప్రసారం చేయవద్దని, నిషేధించాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. మరోవైపు, 2025 పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పాకిస్థాన్ కంటెంట్‌ను భారత్‌లో ప్రసారం చేయకూడదని కేంద్ర ప్రభుత్వం గురువారం నెట్‌ఫ్లిక్స్‌కు గుర్తు చేసినట్లు సమాచారం. గత ఏడాది జూన్‌లో ఇచ్చిన హామీని పాటించాలని కూడా సూచించినట్లు కథనం పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!