

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసులు సమర్పించిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. అంతకుముందు రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. తొలిసారి అధికారికంగా ఎర్రకోటపై వందేమాతరం ఆలాపన జరగడం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వందేమాతరం ఆకారంలో మానవహారం, హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కూడా ఆకట్టుకున్నాయి.
జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ.. ఎందరో వీరుల బలిదానాల ఫలితమే స్వాతంత్య్రమని అన్నారు. దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని, ప్రతి భారతీయుడి హృదయం వందేమాతరం నినాదంతో మారుమోగుతోందని పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో దేశం వేగంగా అభివృద్ధి సాధించిందని, 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడి తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారని తెలిపారు. రక్షణ ఉత్పత్తులు నాలుగు రెట్లు పెరిగాయని, చట్టాల్లో అనేక మార్పులు తీసుకొచ్చామని అన్నారు.
దేశం ఇతర దేశాలపై ఆధారపడకూడదని, స్వయం సమృద్ధి సాధించడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పేదలకు వేగంగా ఇళ్లు నిర్మించడం, వోకల్ ఫర్ లోకల్ నినాదంతో ముందుకు సాగడం, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం, రైల్వే విద్యుదీకరణ, మెట్రో రైళ్ల విస్తరణ వంటి అంశాలను ప్రస్తావించారు. సెమీకండక్టర్ రంగం, క్రిటికల్ మినరల్ కారిడార్, ఇంధన భద్రత, ఐదు కొత్త న్యూక్లియర్ ప్లాంట్లపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. కరోనా, యుద్ధాలు వంటి ఎన్నో సవాళ్లను అధిగమించామని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించి తీరతామని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!