

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనకు అత్యంత ఇష్టమైన కెప్టెన్లు ఎవరనే విషయాన్ని వెల్లడించారు. టీమిండియా మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ తన ఫేవరెట్ కెప్టెన్లని స్పష్టం చేశారు. తాజాగా రెడ్డిట్‌లో నిర్వహించిన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సచిన్ ఈ సమాధానం ఇచ్చారు. భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం, ఆ బాధ్యతలను నిర్వహించడంలో ఎదురైన సవాళ్లు, దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా నాయకత్వం గురించి కూడా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప గౌరవంగా భావించానని సచిన్ తెలిపారు. అయితే, తనకు నచ్చిన ఆటగాళ్లను పూర్తిస్థాయిలో స్వేచ్ఛగా ఎంపిక చేసుకునే అవకాశం ఎప్పుడూ ఉండేది కాదని పేర్కొన్నారు. 1990వ దశకంతో పోలిస్తే ప్రస్తుతం బీసీసీఐ మరింత వృత్తిపరమైన సంస్థగా మారిందని, అప్పట్లో భారత క్రికెట్ అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందని చెప్పారు. టెంబా బవుమా నాయకత్వాన్ని, ఆయన స్ఫూర్తిని అభినందించారు. గంగూలీ నాయకత్వంలో 2003 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడిన సచిన్, ధోనీ సారథ్యంలో 2011 ప్రపంచకప్‌ను గెలుచుకున్నారు. సచిన్ 1996 నుంచి 2000 మధ్య రెండు విడతల్లో భారత టెస్టు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి, మొత్తం 25 టెస్టులకు నాయకత్వం వహించారు. 2000లో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో టెస్టు సిరీస్ ఓటమి తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్నారు. 2007లో మరోసారి టెస్టు కెప్టెన్సీ చేపట్టే అవకాశం వచ్చినా అంగీకరించకపోవడంతో ఆ బాధ్యతలు ధోనీకి దక్కాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!