

ఆటో కార్మిక సంఘాలతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ప్రభుత్వం తమ డిమాండ్ల పట్ల సానుకూలంగా ఉందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి నిరవధిక సమ్మెను విరమించిన ఆటో కార్మిక సంఘాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆర్టీసీ తరఫున ఈవీ ఆటోలు కొనుగోలు చేస్తారనే ప్రచారాన్ని ప్రభుత్వం ఖండించింది. ఆటో కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుకు అంగీకరించింది. దీనికి సంబంధించిన విధివిధానాలపై సెప్టెంబర్ 1న కార్మిక, రవాణా శాఖల అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు.
2012 తర్వాత ఆటో చార్జీలు పెరగనందున, తగిన నివేదిక ఆధారంగా చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుని సంబంధిత జీవో జారీ చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఓలా, ఉబర్ తరహాలో ప్రభుత్వం తరఫున ప్రత్యేక యాప్‌ను ప్రారంభించే ప్రక్రియను ఐటీ శాఖ ద్వారా చేపట్టనుంది. రాపిడో, ఓలా, ఉబర్ వంటి ద్విచక్ర వాహన ప్రయాణ సేవలకు ఎల్లో ప్లేట్ ఉన్న వాహనాలకే అనుమతి ఇచ్చే అంశాన్ని పరిశీలించనుంది. ఎన్నికల హామీ మేరకు ఆటో కార్మికులకు ₹12,000 ఆర్థిక సాయం అంశంపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్ కోర్ ఏరియాలో పాత పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రోఫిటింగ్ ద్వారా ఈవీ ఆటోలుగా మార్చేందుకు ₹1.50 లక్షల వరకు సహాయం అందించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!