

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడిని ఢిల్లీలో కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో నిర్వహించిన ఫీజిబిలిటీ సర్వేకు కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన వారు, అనువుగా లేని స్థలానికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రదేశాన్ని ప్రతిపాదించిందని వివరించారు. ఆ ప్రాంతంలో త్వరగా మరో సర్వే నిర్వహించి ప్రాజెక్ట్ను ముందుకు తీసుకెళ్లాలని కోరారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయానికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఈ ఎయిర్పోర్ట్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రులు తెలిపారు. అలాగే పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాల అభివృద్ధికి ఇది కీలకంగా మారుతుందని పేర్కొన్నారు. సింగరేణి గనులు, పారిశ్రామిక సంస్థలు, అటవీ సంపద, ఎకో టూరిజం అవకాశాలతో ఉన్న భద్రాద్రి ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ కొత్త ఊపునిస్తుందని వివరించారు. ప్రాజెక్ట్ అమలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!