

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలైన చేనేత సంక్షేమ పథకాలను వెంటనే పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నేతన్నలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆర్డర్లను కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు అప్పగించడం వల్ల సంప్రదాయ చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, అస్తిత్వానికి చేనేత వెన్నెముక వంటిదని, నేతన్నలకు ప్రభుత్వం భరోసా కల్పించాలని కోరారు.
కేటీఆర్ తన లేఖలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై కూడా విమర్శలు గుప్పించారు. ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ బోర్డు, హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డు, పవర్‌లూమ్ బోర్డులను రద్దు చేయడం, పలు సంక్షేమ పథకాలను నిలిపివేయడం, చేనేత ఉత్పత్తులపై 5 శాతం జీఎస్టీ విధించడం వంటి నిర్ణయాలు చేనేత రంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయని అన్నారు. "మన చేనేత... మన గౌరవం. నేతన్న బతికితేనే చేనేత బతుకుతుంది. చేనేత బతికితేనే మన సంస్కృతి, మన స్వాభిమానం సజీవంగా ఉంటాయి" అంటూ ప్రభుత్వం మోసపూరిత వైఖరిని వీడి నేతన్నల కుటుంబాలకు అండగా నిలవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!