

పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు దౌత్య ప్రయత్నాలు మళ్లీ ఊపందుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ అభిప్రాయాలను, అమెరికాతో కొనసాగుతున్న ఘర్షణకు పరిష్కారం కనుగొనేందుకు ఇరాన్ అనుసరించాలనుకుంటున్న మార్గాన్ని ట్రంప్‌కు వివరించినట్లు క్రెమ్లిన్ వెల్లడించింది. పుతిన్ ఇరాన్ వైఖరిని అమెరికా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లినట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అయితే, ఈ ప్రతిపాదనలపై ట్రంప్ ఎలా స్పందించారనే విషయాన్ని రష్యా వెల్లడించలేదు.
ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడటానికి ముందు పుతిన్, తుర్క్మెనిస్థాన్లో జరిగిన శిఖరాగ్ర సమావేశం సందర్భంగా ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో భేటీ అయ్యారు. పశ్చిమాసియాలో శాంతిని పునరుద్ధరించేందుకు మధ్యవర్తిత్వం వహించడానికి రష్యా గతంలోనే ఆసక్తి వ్యక్తం చేసింది. తాజాగా జరిగిన చర్చలు ఆ దిశగా దౌత్య ప్రయత్నాలకు ప్రాధాన్యం పెంచాయి. అయితే, ఇరాన్ ప్రతిపాదనల్లోని కీలక అంశాలు ఏమిటి, వాటిని అమెరికా పరిశీలించేందుకు సిద్ధంగా ఉందా అనే విషయాలపై స్పష్టత లేదు. యుద్ధానికి పరిష్కారం లభించే అవకాశాలపై కూడా ఇంకా అధికారిక సమాచారం వెలువడలేదు.

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!