

ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాధాన్యం కలిగిన రాజమహేంద్రవరం నగరాన్ని కాశీ తరహాలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. నగరానికి బంగారు భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేశామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం అభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, భాజపా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జనసేన, భాజపా నాయకులు పాల్గొన్నారు. నగరంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించడంతో పాటు గోదావరిని స్వచ్ఛ గోదావరిగా మార్చేందుకు ప్రత్యేక ప్రాజెక్టు తీసుకొస్తామని, పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు చేపడతామని మాధవ్ హామీ ఇచ్చారు.
రాజమహేంద్రవరం శివారు ప్రాంతాలకు తాగునీటి సరఫరా, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. రూ.89 కోట్లతో హేవలాక్ బ్రిడ్జి అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వివరించారు. దేవాలయాల అభివృద్ధి కోసం ప్రసాదం పథకం కింద ఇప్పటికే రూ.100 కోట్ల నిధులు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మరోవైపు, వైకాపాకు ఓటు వేయడం ఓటును దుర్వినియోగం చేసినట్లేనని వ్యాఖ్యానించారు. గత వైకాపా పాలనలో విధ్వంసం జరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!