

భారత ఆటోమొబైల్ రిటైల్ మార్కెట్ 2026 పండగ సీజన్‌లో సరికొత్త రికార్డు సృష్టించింది. 42 రోజుల పండగ సీజన్‌లో దేశవ్యాప్తంగా మొత్తం 55.25 లక్షల వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే విక్రయాలు 2.21 శాతం పెరిగినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది. ఈసారి విద్యుత్ వాహనాల విక్రయాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గత ఏడాదితో పోలిస్తే 52.62 శాతం వృద్ధితో మొత్తం 5.09 లక్షల విద్యుత్ వాహనాలు అమ్ముడయ్యాయి. ఒకే పండగ సీజన్‌లో ఈ విక్రయాలు ఐదు లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి.
ఇదే సమయంలో ద్విచక్ర వాహనాల అమ్మకాలు 3.67 శాతం, వాణిజ్య వాహనాల విక్రయాలు 7.13 శాతం పెరిగాయి. అయితే వ్యక్తిగత ప్రయాణ వాహనాల అమ్మకాలు మాత్రం 7.16 శాతం తగ్గి 7.48 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయి. పండగ సీజన్‌లో నమోదైన ఈ బలమైన విక్రయాలు దేశంలో వార్షిక వాహన రిటైల్ అమ్మకాలు మూడు కోట్ల మార్కును చేరుకోవడానికి మరింత చేరువ చేశాయని ఎఫ్‌ఏడీఏ పేర్కొంది. విద్యుత్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో కీలక మార్పుగా నిలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!