

యెమెన్‌లోని హూతీలపై అమెరికా పరిమిత సైనిక జోక్యంతో సౌదీ అరేబియా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రియాద్, వాషింగ్టన్ మధ్య సంబంధాల్లో మరింత ఉద్రిక్తత ఏర్పడే అవకాశం ఉందని మాజీ అమెరికా ఇంటెలిజెన్స్ అధికారి రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కరెన్ గిబ్సన్ పేర్కొన్నారు. హూతీలపై కొత్త వైమానిక దాడులకు అమెరికా వెనుకాడిన విషయాన్ని సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ (MBS) సులభంగా మర్చిపోరని ఆమె వ్యాఖ్యానించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే అమెరికా సౌదీకి ఇంటెలిజెన్స్, ఆయుధాలు, ఎయిర్ డిఫెన్స్ సహాయాన్ని కొనసాగిస్తోంది. మరోవైపు ఒమన్ మధ్యవర్తిత్వంతో హూతీలతో చర్చలు కూడా కొనసాగిస్తోంది. ఇదే సమయంలో సౌదీ అభ్యర్థన మేరకు బ్రిటన్ పరిమిత కాలం రక్షణాత్మక ఎయిర్-టు-ఎయిర్ రీఫ్యూయలింగ్ సాయం అందించేందుకు అంగీకరించింది.
యెమెన్‌లో ఘర్షణలు మళ్లీ తీవ్రం కావడంతో ఎర్ర సముద్రం, బాబ్ అల్-మాండెబ్ జలసంధి భద్రతపై ఆందోళనలు పెరుగుతున్నాయి. యెమెన్‌లోని ఎర్ర సముద్ర తీర ప్రాంతాల్లో హూతీలు తమ ఆధిపత్యాన్ని విస్తరిస్తున్నట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో సౌదీ భద్రతకు మద్దతుగా బ్రిటన్ రీఫ్యూయలింగ్ విమానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మరోవైపు సౌదీకి దాదాపు 50 ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయానికి అమెరికా నోటిఫై చేసినట్లు సమాచారం. అయితే వాటి సరఫరాకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. సౌదీ అంశంతో పాటు ప్రాంతీయ భద్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లో గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ప్రతినిధులతో చర్చించనున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!