

కొడంగల్‌ను విద్యా, పారిశ్రామిక రంగాల్లో కీలక కేంద్రంగా అభివృద్ధి చేసి, దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్ ఇండస్ట్రియల్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన పరిశ్రమల ఉత్పత్తుల స్టాళ్లను ఆయన మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ తదితరులతో కలిసి సందర్శించారు. ఏరోస్పేస్, రక్షణ, గ్రీన్ టెక్నాలజీ, పునరుత్పాదక ఇంధనం, ఉక్కు, రాగి, వస్త్ర, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులు, సాంకేతిక సామర్థ్యాలను ప్రదర్శించాయి. అనంతరం ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన ముఖాముఖిలో మాట్లాడిన సీఎం.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో పాలమూరు ప్రాంతంలోని కీలక సాగునీటి ప్రాజెక్టులు పూర్తికాలేదని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని విమర్శిస్తూ, ఎల్‌నినో, కాళేశ్వరం, గోదావరి జలాలపై డిసెంబర్‌లో అసెంబ్లీలో రెండు రోజుల చర్చకు అనుమతించాలని స్పీకర్‌ను కోరారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మక్తల్–నారాయణపేట ఎత్తిపోతల పథకం పనులను వేగవంతం చేశామని రేవంత్ రెడ్డి తెలిపారు. భూసేకరణలో రైతులకు మెరుగైన పరిహారం అందిస్తున్నామని చెప్పారు. రూ.10 వేల కోట్లతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ప్రకటించారు. RARE ఎడ్యుకేషన్ హబ్, RARE ఇండస్ట్రియల్ పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు తాండూరు కందులను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కొడంగల్‌లో పరిశ్రమలు, విద్యాసంస్థల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెంచుతామని హామీ ఇచ్చారు. మరోవైపు, ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని, రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. సంక్రాంతి తర్వాత ప్రజాబలం కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలను కలుస్తానని, ఎల్‌నినో ముప్పును అందరూ కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!