

నిరుపేద మహిళల నుంచి అక్రమంగా అండాలు సేకరిస్తున్నారనే ఆరోపణలపై ఆసుపత్రులు, ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై మహిళా కమిషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో కొంతమంది ఏజెంట్లపైనే కేసులు నమోదు చేసి, ప్రధాన సూత్రధారులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రులు, ల్యాబ్‌లపై చర్యలు తీసుకోకపోవడాన్ని తప్పుబట్టింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో ఆదేశించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన పురోగతి లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద బాధిత మహిళలను పరామర్శించిన సమయంలో ఇందిరా ఐవీఎఫ్ సెంటర్, నర్మద ఫర్టిలిటీ సెంటర్, ఓయాసిస్ ఫర్టిలిటీ సెంటర్, సద్గురు ఏఆర్‌టీ సెంటర్, పద్మజ ఫర్టిలిటీ సెంటర్లతో పాటు డాక్టర్ హుస్సేన్ పేరును బాధితులు ప్రస్తావించినట్లు కమిషన్ తెలిపింది. ఇప్పటివరకు డాక్టర్ హుస్సేన్ ఆచూకీ గుర్తించకపోవడం, కేసు నమోదు చేయకపోవడంపై కూడా అసహనం వ్యక్తం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసుపత్రులు, ఐవీఎఫ్ కేంద్రాలపై తక్షణమే విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. మహిళల శారీరక స్వేచ్ఛ, గౌరవం, ఆరోగ్యానికి భంగం కలిగించే చర్యలపై ఎలాంటి జాప్యం చేసినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!