

బిగ్‌బాస్ అభిమానులకు జియోస్టార్ భారీ సర్‌ప్రైజ్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా తొలిసారి హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్ ఆరు ఎడిషన్లను ఒకేసారి ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2026 సెప్టెంబర్ నుంచి జియోస్టార్ టెలివిజన్ నెట్‌వర్క్, జియో హాట్‌స్టార్‌లో ఈ ఆరు ఎడిషన్లు ప్రసారం కానున్నాయి. బిగ్‌బాస్‌కు పర్యాయపదంగా మారిన సల్మాన్ ఖాన్, విజయ్ సేతుపతి, నాగార్జున్, కిచ్చా సుదీప్, మోహన్‌లాల్ తమ తమ ఎడిషన్లకు హోస్ట్‌లుగా కొనసాగనున్నారు. ఈ ఏడాది బెంగాల్ దాదా సౌరవ్ గంగూలీ చేరికతో షోకు మరింత ఆకర్షణ పెరగనుంది.
ఈ మైలురాయిని పురస్కరించుకుని జియో హాట్‌స్టార్ ‘ఇండియాస్ బిగ్ రియాలిటీ’ పేరుతో డేటా ఆధారిత కాఫీ టేబుల్ పుస్తకాన్ని ఆవిష్కరించింది. బిగ్‌బాస్ రెండు దశాబ్దాల ప్రయాణం, ప్రేక్షకులపై దాని ప్రభావం, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. జియోస్టార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025లో బిగ్‌బాస్ ఆరు భాషా ఎడిషన్లను కలిపి 500 మిలియన్లకు పైగా వీక్షకులను చేరుకుంది. 438 బిలియన్లకు పైగా వీక్షణ నిమిషాలను నమోదు చేసింది. వీక్షకుల ఎంగేజ్‌మెంట్ ఏడాదికేడాది 47 శాతం పెరిగింది. 625కు పైగా బ్రాండ్లు బిగ్‌బాస్ వేదికను ఉపయోగించుకున్నాయి. జియో హాట్‌స్టార్‌లో బిలియన్ల కొద్దీ ఓట్లు, కోట్లాది లైవ్ చాట్‌లు నమోదవడం షోకు ఉన్న డిజిటల్ క్రేజ్‌ను తెలియజేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!