

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ హట్టి గోల్డ్ మైన్స్‌తో సింగరేణి జాయింట్ వెంచర్ అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. బంగారం అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్, శుద్ధిలో హట్టికి ఉన్న అనుభవాన్ని.. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో సింగరేణికి ఉన్న సాంకేతిక సామర్థ్యంతో సమన్వయం చేస్తే దేశీయ బంగారం ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కర్ణాటకలోని గోల్డ్ మైన్స్ ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా శుక్రవారం రాయచూరు జిల్లాలోని హట్టి, యూటీ బంగారు గనులను ఆయన సందర్శించి, ఖనిజం వెలికితీత నుంచి శుద్ధ బంగారం తయారీ వరకు జరుగుతున్న ప్రక్రియలను పరిశీలించారు.
బంగారం అన్వేషణ, తవ్వకం, వెలికితీత, శుద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సేవలు, మానవ వనరుల శిక్షణ వంటి అంశాల్లో హట్టి–సింగరేణి కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలని భట్టి సూచించారు. దేశ ఆర్థిక భద్రతలో బంగారం కీలక పాత్ర పోషిస్తుందని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. హట్టి గోల్డ్ మైన్స్ ఉత్పత్తి యూనిట్, ఖనిజ శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన.. యూటీ ఓపెన్‌కాస్ట్, భూగర్భ గనుల్లో తవ్వకాలు, రవాణా, యంత్రాల వినియోగం, కార్మికుల భద్రత తదితర అంశాలను తెలుసుకున్నారు. హట్టి ప్రాజెక్టులో రోజుకు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం ఉత్పత్తి అవుతోందని అధికారులు వివరించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!