

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అల్యూమినియం ఉత్పత్తి వ్యాపారంలోకి ప్రవేశించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రతిపాదన ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని, తుది నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉందని తెలుస్తోంది. అల్యూమినియం తయారీకి కీలకమైన ముడి పదార్థం బాక్సైట్. ఒడిశాలోని కర్లాపట్ బాక్సైట్ బ్లాక్ వేలంలో పాల్గొనేందుకు రిలయన్స్ రూ.5 లక్షలతో టెండర్ పత్రాలను కొనుగోలు చేసింది. అయితే ఈ బ్లాక్‌ను వేదాంత అల్యూమినియం అనుబంధ సంస్థ బాల్కో దక్కించుకుంది.
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో రెండు బొగ్గు గనులను వేలం ద్వారా దక్కించుకున్న రిలయన్స్.. అక్కడ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్లాంట్‌లో బొగ్గును సింథసిస్ గ్యాస్‌గా మార్చి విద్యుత్ ఉత్పత్తికి లేదా పారిశ్రామిక ఇంధనంగా వినియోగించవచ్చు. ప్రతిపాదిత ప్రాజెక్టు నుంచి లభించే గ్యాస్‌ను అల్యూమినియం సహా ఇతర లోహాల ఉత్పత్తికి ఉపయోగించుకునే అవకాశాలను రిలయన్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ ఇప్పటికే అల్యూమినియం రంగంలోకి అడుగుపెట్టింది. యూఏఈకి చెందిన ఓ సంస్థ భాగస్వామ్యంతో ఒడిశాలో ఏడాదికి 20 లక్షల టన్నుల సామర్థ్యంతో అల్యూమినియం ఉత్పత్తి ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు అదానీ ఎంటర్‌ప్రైజెస్ జూన్‌లో ప్రకటించింది. ఇందుకోసం సుమారు 1,150 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. దీంతో అదానీ గ్రూప్‌కు పోటీగా రిలయన్స్ కూడా అల్యూమినియం రంగంలోకి వస్తుందా అనే ఆసక్తి నెలకొంది.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!