

విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదె సాయికృష్ణ అదృశ్యం, మృతి కేసుపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక అంశాలను గుర్తించినట్లు రిమాండ్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సాయికృష్ణ పోలీసుల అదుపులో ఉండగానే మృతి చెందినట్లు దర్యాప్తులో నిర్ధారణకు వచ్చినట్లు, అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను దాచేందుకు, మృతదేహాన్ని తరలించేందుకు, ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నాలు జరిగినట్లు నివేదికలో ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో సిట్ పలువురు సాక్షులను విచారించడంతో పాటు శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. సాయికృష్ణ మృతి విషయం అధికారికంగా మెజిస్ట్రేట్‌కు తెలియజేయలేదని, కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన సీసీటీవీ డేటా, డీవీఆర్‌ల విషయంలో ఆధారాలు మాయమయ్యేలా చర్యలు తీసుకున్నట్లు సిట్ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. కేసుకు సంబంధించిన డీవీఆర్‌లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపినట్లు కూడా నివేదికలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో అప్పటి కృష్ణలంక సీఐ నాగరాజుతో పాటు పలువురు పోలీసు సిబ్బందిపై నమోదైన కేసు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!