

దానం నాగేందర్ అనర్హత కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం విషయంలో ద్వంద్వ వైఖరిని అవలంబిస్తోందని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి, అదే పార్టీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ ఆయనపై అనర్హత విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకున్న తీరుపై హరీశ్ రావు ప్రశ్నలు లేవనెత్తారు. తాజాగా హైకోర్టు దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడంతో ఈ వ్యవహారంపై మరోసారి చర్చ మొదలైందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ 2024 ఎన్నికల మేనిఫెస్టోలో పార్టీ ఫిరాయింపులను అనర్హతకు కారణంగా పేర్కొంటూ రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను సవరించాలని హామీ ఇచ్చిందని హరీశ్ రావు గుర్తుచేశారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలపై కూడా రాజ్యాంగం, చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరారు. రాజ్యాంగ పరిరక్షణపై కాంగ్రెస్ నిజంగా కట్టుబడి ఉంటే, ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల నుంచి తాజా తీర్పు పొందేలా చూడాలని రాహుల్ గాంధీని ఉద్దేశించి హరీశ్ రావు అన్నారు. ‘సత్యమేవ జయతే’ అంటూ తన స్పందనను ముగించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!