

మెడికల్ వీసాపై భారత్‌కు వచ్చి అదృశ్యమైన బంగ్లాదేశ్ పౌరుడి ఆచూకీ గుర్తించేందుకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తక్షణమే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వివరాల ప్రకారం.. సదరు వ్యక్తి 2025 మార్చిలో వైద్య చికిత్స నిమిత్తం మెడికల్ వీసాపై భారత్‌కు వచ్చాడు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో చికిత్స పొందాల్సి ఉండగా, అనూహ్యంగా అదృశ్యమయ్యాడు. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సమర్పించిన నివేదికలో అతని మొబైల్ ఫోన్ సిగ్నల్ చివరిసారిగా జార్ఖండ్‌లోని దేవఘర్ సమీపంలో గుర్తించినట్లు వెల్లడించింది.
తన భర్త కనిపించడం లేదని, అతని ఆచూకీ గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు వ్యక్తి భార్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం వెంటనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని జార్ఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలతో అదృశ్యమైన బంగ్లాదేశ్ పౌరుడి ఆచూకీ గుర్తించేందుకు తదుపరి దర్యాప్తు చేపట్టే అవకాశం ఏర్పడింది. ఆయన ఎక్కడికి వెళ్లారు? ఎలా అదృశ్యమయ్యారు? అనే అంశాలపై దర్యాప్తులో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!