

న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ‘ది ప్యారడైజ్’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. సెప్టెంబర్ 24న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో, విడుదలకు ఒకరోజు ముందే సెప్టెంబర్ 23న సాయంత్రం 6:30 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ షోకు జీఎస్టీతో కలిపి ఒక్కో టికెట్ ధరను రూ.500గా నిర్ణయించారు. అలాగే సెప్టెంబర్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని థియేటర్లలో రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. తొలి పది రోజుల పాటు టికెట్ ధరలపై అదనపు చార్జీలకు కూడా అనుమతి లభించింది. మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు రూ.95, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రూ.45 అదనపు చార్జీ వసూలు చేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఇదే కాలానికి వరుసగా రూ.48, రూ.23 అదనపు చార్జీ విధించనున్నారు. ఈ అదనపు మొత్తాల్లో జీఎస్టీ కూడా కలిపి ఉంటుంది.
టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇవ్వడంతో పాటు ప్రభుత్వం నిర్మాతలకు కొన్ని షరతులు విధించింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీకి నిర్మాతలు తప్పనిసరిగా రూ.1 కోటి విరాళం అందించాలని ఆదేశించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోని ఈ నిధులను సినీ పరిశ్రమలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు. అలాగే సినిమా ప్రదర్శన సమయంలో డ్రగ్స్ దుష్ప్రభావాలు, సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన కల్పించే ప్రకటనలను తప్పనిసరిగా ప్రదర్శించాలని ప్రభుత్వం సూచించింది. ఈ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, సంబంధిత లైసెన్సింగ్ అధికారులను ఆదేశించింది. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, ప్రత్యేక ప్రీమియర్ షో, పెరిగిన టికెట్ ధరలు, రోజుకు ఐదు షోల అనుమతితో సినిమా విడుదలపై ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!