

ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు రూ.10 వేల కోట్లతో కరువు ప్రభావ నివారణ చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో నిర్వహించిన తెలంగాణ క్లైమేట్ కాంక్లేవ్–కర్టెన్‌రైజర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, ఎల్‌నినో ప్రభావం, సాగునీరు, తాగునీటి భద్రతకు సంబంధించి ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు, గ్రామీణ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. వ్యవసాయం, గ్రామీణ జీవనంపై ఎల్‌నినో ప్రభావాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు సిద్ధం చేస్తోందని పేర్కొన్నారు.
సంక్రాంతి తర్వాత ఐదు నెలల పాటు కరువు ప్రభావిత ప్రాంతాల్లో నెలకు రూ.2 వేల కోట్ల చొప్పున ఖర్చు చేసి వివిధ పనులు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ప్రజల భాగస్వామ్యంతో క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా పనులను ఎంపిక చేస్తామని తెలిపారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఐదంచెల వ్యూహాన్ని రూపొందించినట్లు వివరించారు. పచ్చదనాన్ని పెంపొందించడం, జలభద్రతను బలోపేతం చేయడం ద్వారా వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకోగల తెలంగాణను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!