

విద్యుత్ వినియోగ వృద్ధిరేటులో తెలంగాణ దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేంద్ర విద్యుత్ మండలి (సీఈఏ) తాజా నివేదిక ప్రకారం, 2026 ఏప్రిల్ నెలలో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గత ఏడాదితో పోలిస్తే 20.5 శాతం పెరిగింది. దీంతో తెలంగాణ దేశంలో నంబర్‌వన్ ర్యాంకును సాధించింది. బిహార్ 20.1 శాతం, కర్ణాటక 19 శాతం, ఆంధ్రప్రదేశ్ 11.9 శాతం వృద్ధితో తర్వాతి స్థానాల్లో నిలిచాయి. 2025 ఏప్రిల్‌లో 7,430 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్ వినియోగం, 2026 ఏప్రిల్ నాటికి 8,953 మిలియన్ యూనిట్లకు చేరింది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, నిర్మాణ రంగం విస్తరణ, ఆర్థిక కార్యకలాపాల పెరుగుదల ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 87,266 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగంతో తెలంగాణ దేశంలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అదే సమయంలో గృహ విద్యుత్ కనెక్షన్లు 1.37 కోట్ల నుంచి 1.40 కోట్లకు పెరిగాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఒకే ఏడాదిలో ఇంత భారీ స్థాయిలో కనెక్షన్లు పెరగడం ఇదే తొలిసారి. వ్యవసాయ బోర్లకు 30.36 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉండగా, గత ఏడాదిలోనే మరో 1.08 లక్షల కొత్త కనెక్షన్లు మంజూరు చేశారు. దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. రాష్ట్ర విద్యుత్ వినియోగంలో దాదాపు 40 శాతం వ్యవసాయ రంగానికే వెళ్తోందని నివేదికలు పేర్కొన్నాయి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!