

టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబోట్ హెచ్-1బీ వీసాదారుల నియామకాలపై మరిన్ని ఆంక్షలు విధించే ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో కొత్త హెచ్-1బీ వీసా దరఖాస్తులపై పరిమితులు ఉండగా, ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ హెచ్-1బీ వీసాదారులను నియమించకుండా నిబంధనలు తీసుకురావాలని ప్రతిపాదించారు. విదేశీ సంస్థలు లేదా వ్యక్తుల నుంచి ప్రభుత్వ పాఠశాలలు విరాళాలు స్వీకరించడం, ఆర్థిక ఒప్పందాలు చేసుకోవడంపైనా పరిమితులు విధించాలని ఆయన సూచించారు. ఈ ప్రతిపాదనలపై వచ్చే ఏడాది టెక్సాస్ చట్టసభలో చర్చ జరగనుంది.
అయితే ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే ఇప్పటికే ఉపాధ్యాయుల కొరత ఎదుర్కొంటున్న టెక్సాస్ ప్రభుత్వ పాఠశాలలకు సవాళ్లు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు, కఠినమైన వీసా విధానాలు, భద్రతా ఆందోళనల కారణంగా అమెరికాలో ఉన్నత విద్యపై అంతర్జాతీయ విద్యార్థుల ఆసక్తి తగ్గుతున్నట్లు నావిటాస్ సర్వే వెల్లడించింది. అమెరికాను సురక్షితమైన, స్థిరమైన విద్యా గమ్యస్థానంగా కేవలం 31 శాతం మంది మాత్రమే భావించినట్లు సర్వే తెలిపింది. వీసా ప్రక్రియపై అమెరికాకు 25.3 శాతం రేటింగ్ మాత్రమే లభించగా, యూకే 74.1 శాతం రేటింగ్‌తో ముందంజలో ఉంది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!