

అక్రమ మార్గంలో అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన ముగ్గురు భారతీయులు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మమతా చద్వా, రుత్విక్ జన్సారీ, మయూరీ సోలంకీలుగా వారిని గుర్తించారు. ఇథియోపియా నుంచి తమకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి.. ముగ్గురినీ కిడ్నాప్ చేశామని, విడుదల చేయాలంటే రూ.కోటి చెల్లించాలని డిమాండ్ చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. విదేశాలకు అక్రమ మార్గంలో తరలించే నెట్‌వర్క్‌కు చెందిన అల్పేశ్ పంచల్, భార్గవ్ పటేల్‌తో వారు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఒక్కొక్కరికి రూ.75 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదిరినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
సెప్టెంబర్ 20న ముగ్గురూ రాజస్థాన్‌కు వెళ్లి, అక్కడి నుంచి అబుధాబికి ఎతిహాద్ ఎయిర్‌వేస్ విమానంలో ప్రయాణించారు. అనంతరం ఇథియోపియా చేరుకున్నారు. నెల రోజుల వీసాతో అక్కడ ఉన్నట్లు సమాచారం. సెప్టెంబర్ 22న మమత కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాము కెనడా చేరుకున్నామని చెప్పింది. ఆ తర్వాత ముగ్గురి ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. మూడు రోజుల అనంతరం గుర్తుతెలియని వ్యక్తి నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్ వచ్చింది. ముగ్గురినీ కిడ్నాప్ చేశామని, వారిని విడిచిపెట్టాలంటే రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వారు తెలిపారు. ఇప్పటికే ఏజెంట్లకు లక్షల్లో చెల్లించడంతో ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వం జోక్యం చేసుకుని తమవారిని సురక్షితంగా తీసుకురావాలని మమత తండ్రి కోరారు. ఇప్పటికే కిడ్నాపర్లకు రూ.60 లక్షలు చెల్లించామని, వారు అదనంగా రూ.కోటి డిమాండ్ చేస్తున్నారని అల్పేశ్ పంచల్ చెప్పినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!