

దశాబ్దానికి పైగా ప్రపంచ చదరంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు ఇప్పుడు నంబర్‌వన్ ర్యాంకు విషయంలో గట్టి పోటీ ఎదురవుతోంది. 2011 నుంచి అగ్రస్థానంలో కొనసాగుతున్న నార్వే స్టార్.. టోటల్ చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టూర్ పైలెట్ టోర్నమెంట్‌లో క్లాసికల్ విభాగంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పటివరకు ఐదు గేమ్‌లను డ్రా చేసుకుని, ఒక మ్యాచ్‌లో ఓటమి చవిచూశాడు. మూడో రౌండ్ తొలి గేమ్‌లో అర్మేనియాకు చెందిన హైక్ మర్టిరోస్యాన్ చేతిలో ఓడిన కార్ల్‌సన్.. రెండో గేమ్‌ను డ్రాగా ముగించాడు. దీంతో లైవ్ రేటింగ్‌లో 15.8 పాయింట్లు కోల్పోయి 2807.2కు చేరుకున్నాడు. మరోవైపు అమెరికా గ్రాండ్‌మాస్టర్ ఫాబియానో కరువానా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఐదు గేమ్‌లలో విజయం సాధించి, మరో రెండు గేమ్‌లను డ్రా చేసుకున్నాడు. దీంతో లైవ్ రేటింగ్‌లో 17 పాయింట్లు సంపాదించి 2800కు చేరుకున్నాడు. ప్రస్తుతం కార్ల్‌సన్, కరువానా మధ్య వ్యత్యాసం కేవలం 7.2 పాయింట్లే కావడంతో నంబర్‌వన్ ర్యాంకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ టోర్నీలో భారత ఆటగాళ్లూ పోటీపడుతున్నారు. మూడో రౌండ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ వెస్లీ సోతో తలపడిన అర్జున్ ఇరిగేశి ఒక గేమ్‌లో గెలిచి, మరో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. కజకిస్థాన్‌కు చెందిన బిబిసారాతో జరిగిన పోరులో వైశాలి తొలి గేమ్‌లో ఓడినా, రెండో గేమ్‌లో విజయం సాధించింది. రష్యా ఆటగాడు వ్లాదిస్లావ్ అర్టెమియెవ్‌తో తలపడిన ప్రజ్ఞానంద రెండు గేమ్‌లనూ డ్రాగా ముగించాడు. గ్రూప్-డిలో అర్జున్ తొమ్మిది పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, వైశాలి నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. గ్రూప్-బిలో ప్రజ్ఞానంద నాలుగు పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!