

తిరుమలలో ఉచిత ధర్మరథం బస్సుల కోసం స్మార్ట్ బస్టాప్‌లను నిర్మించేందుకు రేమండ్స్ సంస్థ ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ట్రాన్స్‌పోర్ట్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం 21 ప్రాంతాల్లో బస్టాప్‌లను ఆధునికీకరించనున్నారు. ఇందులో ఇప్పటికే ఉన్న ఐదు బస్టాప్ షెల్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు, మరో 16 చోట్ల కొత్తగా నిర్మించనున్నారు. మూడు దశల్లో చేపట్టే ఈ పనుల్లో భాగంగా తొలుత రాంభగీచా, లేపాక్షి కూడలితో పాటు మరో ప్రాంతంలో బస్టాప్‌లను విస్తృతంగా అభివృద్ధి చేయనున్నారు. మిగిలిన ప్రాంతాల్లో రెండు దశల్లో పనులు పూర్తి చేయనున్నారు. ఇందుకోసం తితిదే ఇంజినీరింగ్ అధికారులు ఏఐ ఆధారిత బస్టాప్ నమూనాను దాత సంస్థకు పంపించారు.
ప్రస్తుతం భక్తులు బస్సుల కోసం ఆరుబయట వేచి ఉండాల్సి వస్తోంది. స్మార్ట్ బస్టాప్‌ల నిర్మాణంతో ఎండ, వర్షం నుంచి వారికి ఉపశమనం లభించనుంది. ప్రతి బస్టాప్‌లో వెంకటాద్రి యాప్ ద్వారా పనిచేసే స్మార్ట్ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. భక్తులు తమ ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్ చేస్తే బస్సు రూట్ మ్యాప్, బస్సు రాక సమయం, గమ్యస్థానానికి చేరుకునేందుకు పట్టే సమయం వంటి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ సదుపాయంతో తిరుమలలో భక్తుల ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!