

కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొననున్న బీజేపీ పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. బషీర్‌బాగ్‌లోని బాబూ జగ్జీవన్‌రామ్ (బీజేఆర్) విగ్రహం నుంచి మొజాంజాహీ మార్కెట్ (ఎంజే మార్కెట్) వరకు ఈ పాదయాత్ర సాగనుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 7 గంటల వరకు అవసరాన్ని బట్టి ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టనున్నారు. లిబర్టీ, రవీంద్రభారతి, ట్రాఫిక్ పోలీస్ జంక్షన్, ఏఆర్ పెట్రోల్ పంప్, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం, గన్‌ఫౌండ్రి, జీపీఓ, నాంపల్లి, తాజ్ ఐలాండ్, ఎంజే మార్కెట్, అఫ్జల్‌గంజ్, జాంబాగ్ ప్రాంతాల్లో వాహనాల రద్దీ ఉండే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఏఆర్ పెట్రోల్ పంప్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి రైల్వే స్టేషన్, రవీంద్రభారతి వైపు మళ్లించనున్నారు. జాంబాగ్, అఫ్జల్‌గంజ్ నుంచి జీపీఓ వైపు వచ్చే వాహనాలను తాజ్ ఐలాండ్ వైపు, లిబర్టీ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే వాహనాలను హిమాయత్‌నగర్ లేదా ట్యాంక్‌బండ్ వైపు మళ్లించనున్నారు.
రాజారెడ్డి మార్గ్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వచ్చే వాహనాలను బషీర్‌బాగ్ వద్ద ట్రాఫిక్ పోలీస్ కాంప్లెక్స్ వైపు మళ్లిస్తారు. కింగ్‌కోఠి నుంచి అబిడ్స్ తాజ్‌మహల్ హోటల్ జంక్షన్ వైపు వెళ్లే వాహనాలు బషీర్‌బాగ్, బొగ్గులకుంట మార్గాన్ని వినియోగించుకోవాలి. ఎంజే మార్కెట్ నుంచి జీపీఓ, నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు వెళ్లే వాహనాలను నాంపల్లి వైపు మళ్లించనున్నారు. జీపీఓ నుంచి ఎంజే మార్కెట్ వైపు రాకపోకలకు అనుమతి ఉండదు. ఆర్టీసీ బస్సులకు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు సూచించారు. రవీంద్రభారతి నుంచి వచ్చే బస్సులను నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు, ఎంజే మార్కెట్ నుంచి వెళ్లే బస్సులను తాజ్ ఐలాండ్ వైపు మళ్లిస్తారు. ట్యాంక్‌బండ్ నుంచి లిబర్టీ వైపు వెళ్లే బస్సులు తెలుగు తల్లి జంక్షన్, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి మీదుగా వెళ్లాలి. జిల్లా బస్సులను సీటీఓ జంక్షన్ నుంచి రసూల్‌పురా, బేగంపేట వైపు మళ్లిస్తారు. ప్రయాణికులు ముందుగానే తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు, విమానాశ్రయానికి వెళ్లేవారు ముందుగా బయలుదేరాలని పోలీసులు సూచించారు. పాఠశాలల నుంచి పిల్లలను తీసుకెళ్లే తల్లిదండ్రులు కూడా ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవాలని కోరారు. అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్‌లైన్ 9010203626ను సంప్రదించవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!