

బీహార్‌లో లెవెల్ క్రాసింగ్ వద్ద ఓ వ్యక్తి ప్రయాణికుల రైలును ఆపినట్లు కనిపిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. @SitamarhiJila అనే ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన పోస్టు ప్రకారం.. ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే క్రాసింగ్ వద్ద ఉన్న సమయంలో రైలు అక్కడికి వచ్చింది. ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడిన అనంతరం అతను రైలును ఆపేలా సంకేతం ఇచ్చినట్లు వీడియోలో కనిపిస్తోంది. కొద్దిసేపటికే రైలు అక్కడ ఆగినట్లు కనిపించడంతో, అతని కుటుంబ సభ్యులు స్టేషన్‌కు వెళ్లకుండానే రైలు ఎక్కారని పోస్టులో పేర్కొన్నారు.
అయితే రైలు ఎందుకు అక్కడ ఆగింది, ఆ వ్యక్తి సంకేతం కారణంగానే రైలు ఆగిందా అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టత లేదు. వీడియో తీస్తున్న వ్యక్తి రైలు ఆగిపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, ఈ వీడియో రైల్వే మంత్రిత్వ శాఖకు చేరుతుందని వ్యాఖ్యానించడం వినిపిస్తోంది. సమీపంలో కనిపిస్తున్న వాహనం కూడా ఆ వ్యక్తికి చెందినదా లేదా రైల్వే, ప్రభుత్వ అధికారుల వాహనమా అనే విషయం స్పష్టంగా తెలియలేదు. వీడియో వైరల్ కావడంతో రైల్వే సేవా స్పందించి, తూర్పు మధ్య రైల్వే పరిధిలోని సమస్తీపూర్ డివిజన్ అధికారిక ఖాతాను ట్యాగ్ చేసింది. సంబంధిత అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఘటనపై విచారణ అనంతరం అసలు విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!