

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తోడు తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు ఆందోళనకు కారణమవుతున్నాయి. ఇరాన్ తన సాయుధ బలగాలను ‘కోడ్ 100’ అత్యంత అప్రమత్త స్థితిలో ఉంచినట్లు ప్రాథమిక నివేదికలు వెలువడ్డాయి. ఈ అలర్ట్‌లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), ఆర్మీ, భద్రతా బలగాలు ఉన్నట్లు కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ‘కోడ్ 100’కు సంబంధించిన ఈ సమాచారాన్ని ఇప్పటివరకు ప్రధాన అధికారిక వర్గాలు స్వతంత్రంగా ధ్రువీకరించలేదు.
ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనను కుదించుకుని ఇజ్రాయెల్‌కు తిరిగి వచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉందంటూ అమెరికా తాజాగా తమ పౌరులకు భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకున్న హౌతీల బాలిస్టిక్ క్షిపణిని అడ్డుకున్నట్లు ప్రకటించింది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత విస్తరించే అవకాశాలపై అంతర్జాతీయంగా దృష్టి నెలకొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!