

మధ్యప్రదేశ్ పోలీస్ అధికారిణి నేహా పచిసియా ప్రస్తుతం తీవ్ర ఆరోపణల నేపథ్యంలో వార్తల్లో నిలిచారు. హత్య కేసు నిందితుడి కుటుంబానికి సంబంధించిన భూ లావాదేవీ, డబ్బుల డిమాండ్, బెదిరింపుల ఆరోపణలు రావడంతో కట్నీ సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (CSP)గా పనిచేస్తున్న ఆమెను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది.
నేహా పచిసియా మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లా పచోర్ తహసీల్‌కు చెందినవారు. పోలీస్ శాఖలో చేరకముందు ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2012లో MPPSC పరీక్ష రాసిన ఆమె.. 2016లో వెలువడిన తుది ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 20వ ర్యాంక్ సాధించి డీఎస్పీగా పోలీస్ సర్వీసులో చేరారు. గుణ, భోపాల్, ఖండ్వా ప్రాంతాల్లో వివిధ బాధ్యతలు నిర్వహించిన ఆమె 2025 మేలో కట్నీకి బదిలీ అయ్యారు.
గుణలో CSPగా పనిచేసిన సమయంలో మహిళలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేసేందుకు ఆమె పలు కార్యక్రమాలు చేపట్టినట్లు సమాచారం. మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి మహిళలు తమ ప్రాంతాలకు సమీపంలోనే సమస్యలను పరిష్కరించుకునేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుతం ఆమెపై వచ్చిన ఆరోపణలు ఓ భూ లావాదేవీ చుట్టూ తిరుగుతున్నాయి. సుమారు రూ.80 లక్షల విలువైన భూమిని రూ.18 లక్షలకే కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ భూమికి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి కుటుంబంతో సంబంధం ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా నిందితుడి కుటుంబం నుంచి సుమారు రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు, భూమిని తక్కువ ధరకు తన సహోద్యోగికి బదిలీ చేయించారనే ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ వ్యవహారంలో బెదిరింపులు, మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన ఆరోపణలు కూడా ఉన్నాయి. నేహా పచిసియాతో పాటు మారుఫ్ అహ్మద్, క్షితిజ్ రాజ్‌లపై ఎఫ్‌ఐఆర్ నమోదైనట్లు సమాచారం.
ఈ కేసు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దృష్టికి వెళ్లడంతో ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసిన అనంతరం నేహా పచిసియాను CSP పదవి నుంచి సస్పెండ్ చేశారు. ఆమె కార్యాలయ గది, సిబ్బంది గదిని అధికారులు సీల్ చేసి కేసుకు సంబంధించిన పత్రాలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఆరోపణలు నిరూపితమైనవిగా పరిగణించలేమని, దర్యాప్తు పూర్తయిన తర్వాతే వాస్తవాలు స్పష్టమవుతాయని అధికారులు చెబుతున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!