

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఆర్సీ17 సినిమాపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో కథానాయికగా ఎవరు నటించబోతున్నారనే అంశంపై టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. శ్రీలీల, సారా అర్జున్, భాగ్యశ్రీ బోర్సే, ప్రీతి ముకుందన్, సాత్విక వీరవల్లి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో కొందరికి ఇప్పటికే లుక్ టెస్టులు, ఆడిషన్లు నిర్వహించినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటివరకు హీరోయిన్ ఎంపికపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. గతంలో సారా అర్జున్, సాత్విక వీరవల్లి పేర్లు ఎక్కువగా వినిపించగా.. తాజాగా మరో ముగ్గురు నటీమణుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
భారీ చిత్రాల్లో ప్రస్తుతం మంచి గుర్తింపు ఉన్న కథానాయికలను ఎంపిక చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. అయితే సుకుమార్ మాత్రం ఈ విషయంలో తొందరపడకుండా పాత్రకు తగిన నటిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆయన సినిమాల్లో కథానాయిక పాత్రలకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇందుకు 'రంగస్థలం' సినిమాలో సమంత పోషించిన రామలక్ష్మి పాత్ర మంచి ఉదాహరణ. ఆర్సీ17లోనూ నటనకు ప్రాధాన్యమిస్తూ హీరోయిన్ ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ఐదుగురిలో ఎవరికైనా అవకాశం దక్కుతుందా? లేక జాబితాలో లేని మరో నటిని ఎంపిక చేసి సుకుమార్ సర్ప్రైజ్ ఇస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!