

చేతులు కడుక్కోవడం చాలా చిన్న అలవాటులా అనిపించినా, అది ఆరోగ్యాన్ని కాపాడే అత్యంత ముఖ్యమైన అలవాటు. సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం ద్వారా జలుబు, ఫ్లూ, విరేచనాలు, కడుపు ఇన్ఫెక్షన్లు వంటి అనేక అంటువ్యాధులను నివారించవచ్చు. మొబైల్ ఫోన్లు, డబ్బు, తలుపుల హ్యాండిల్స్, బహిరంగ ప్రదేశాల్లోని వస్తువులను తాకడం వల్ల చేతులకు సూక్ష్మక్రిములు అంటుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల ప్రకారం కనీసం 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు శుభ్రం చేయాలి. అరచేతులు, చేతుల వెనుక భాగం, వేళ్ల మధ్య, బొటనవేళ్లు, గోళ్ల కింద భాగాన్ని బాగా రుద్ది పారే నీటితో శుభ్రం చేసుకోవాలి. సబ్బు, నీరు అందుబాటులో లేకపోతే కనీసం 60 శాతం ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించవచ్చు.
భోజనం చేసే ముందు, వంటకు ముందు మరియు తర్వాత, వాష్‌రూం ఉపయోగించిన తర్వాత, దగ్గిన లేదా తుమ్మిన తర్వాత, చెత్త లేదా పెంపుడు జంతువులను తాకిన తర్వాత, బయట నుంచి ఇంటికి వచ్చిన వెంటనే చేతులు కడుక్కోవాలని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నప్పటి నుంచే పిల్లలకు ఈ అలవాటు నేర్పితే అనేక అంటువ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. కేవలం నీటితో చేతులు కడుక్కోవడం, 20 సెకన్లకు తక్కువ సమయం శుభ్రం చేయడం, గోళ్ల కింద భాగాన్ని శుభ్రం చేయకపోవడం వంటి తప్పులను నివారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: చేతులు సబ్బుతో సరిగ్గా కడుక్కోవడం వల్ల అనేక అంటువ్యాధులను నివారించవచ్చని వైద్యులు చెబుతున్నారు. రోజువారీ జీవితంలో ఈ చిన్న అలవాటే మీ ఆరోగ్యానికి పెద్ద రక్షణగా నిలుస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!