

మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పరిశీలించారు. చిలకలూరిపేట, ఒంగోలు, కొత్తపట్నం, చినగంజాం, చీరాల, బాపట్ల ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని సమీక్షించారు. హెలికాప్టర్ ల్యాండింగ్‌కు వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో క్షేత్రస్థాయి పర్యటనకు బదులుగా ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం అమరావతి సచివాలయానికి చేరుకుని ఆర్టీజీఎస్ కేంద్రం ద్వారా తుఫాన్ పరిస్థితి, సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు.
మరోవైపు, ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలానికి ఏపీఎస్డీఎంఏ వరద హెచ్చరిక జారీ చేసింది. పెదవాగు నుంచి వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని ఆర్టీజీఎస్, ఏపీఎస్డీఎంఏ వెల్లడించాయి. మండలంలోని ముంపు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించాయి. భారీ వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. పొంగిపొర్లుతున్న వాగులు, కాలువలు, వరద నీటితో నిండిన రహదారులను దాటేందుకు ప్రయత్నించవద్దని ప్రజలకు సూచించాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!