

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో న్యూయార్క్ అటార్నీ జనరల్ పదవికి పోటీ చేసిన తెలుగు సంతతి మహిళ సరితా కోమటిరెడ్డి ఓటమిపాలయ్యారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన ఆమెపై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి లెటిటియా జేమ్స్ విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలపై స్పందించిన సరితా తన ఓటమిని అంగీకరించారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్నికల్లో పోటీ చేశానని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఎప్పుడూ ప్రయత్నించలేదని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజాసేవను కొనసాగిస్తానని, న్యూయార్క్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు కృషి చేస్తానని తెలిపారు.
41 ఏళ్ల సరితా కోమటిరెడ్డికి న్యాయరంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆమె కుటుంబం దశాబ్దాల క్రితమే తెలంగాణ నుంచి అమెరికాకు వలస వెళ్లింది. బ్రూక్లిన్‌లో జన్మించిన సరితా.. ఆ తర్వాత కుటుంబంతో కలిసి మిస్సోరికి వెళ్లారు. కొలంబియా లా స్కూల్‌లో లెక్చరర్‌గా పనిచేసిన అనంతరం ఫెడరల్ ప్రాసిక్యూషన్ విభాగంలో విధులు నిర్వర్తించారు. ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మనీలాండరింగ్ వంటి కేసులను వాదించిన అనుభవం ఆమెకు ఉంది. డ్రగ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (డీఈఏ) చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా కూడా పనిచేశారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!